మీరు ఇంగ్లిష్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు?

 

5

ప్రశ్న: మీరు ఇంగ్లిష్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు

  1. ఇంగ్లిష్ తెలుగు కంటే గొప్ప భాష
  2. అందరూ ఇంగ్లిష్ నేర్చుకుంటున్నారు
  3. ఇంగ్లిష్ లో మాట్లాడ్డం ఒక ఫ్యాషన్
  4. పైవన్నీ
  5. పైవేవీ కావు

జవాబు:  5. అదెలా అంటారా? చదవండి……

ఇంగ్లిష్ చాలా దేశాల్లో మాట్లాడే భాష ఐతే కావచ్చుగాని అది మన తెలుగు కంటే గొప్ప భాష మాత్రం కాదు. రెండూ ముఖ్యమైన భాషలే. వేటికవి గొప్పవే. ఫ్యాషన్ విషయానికొస్తే….మూడు , నాలుగు దశాబ్దాల క్రితం ఇంగ్లిష్ లో మాట్లాడటం ఒక ఫ్యాషనేమో గాని, ఇప్పుడది ఫ్యాషన్  ఏ మాత్రం కాదు. ఇంక అందరి సంగతంటారా?  అందరూ చేస్తున్నారనో, అందరూ చెయ్యమంటున్నారనో మనం గుడ్డిగా ఒక పని చెయ్యకూడదు, కదా?. సో, ఇవేవీ సరైన సమాధానాలు కావు, కాకూడదు.

మరి అసలు ఇంగ్లిష్ ఎందుకు నేర్చుకోవాలి? ఇంగ్లిష్ నేర్చుకోవడానికి ముందు అందరికి ఈ విషయం పట్ల క్లారిటి ఉండాల్సిన ఆవసరం ఉంది.

ఇంగ్లిష్ ఎందుకు నేర్చుకోవాలన్న ప్రశ్నకు “ఇంగ్లిష్ బడి” సమాధానం: ఇంగ్లిష్ నేర్చుకోవడం ఒక అవసరం.  కోటి విద్యలు కూటి కొరకే. ఆ కోటి విద్యల్లో ‘ఇంగ్లీష్ లో బాగా మాట్లాడే విద్య ‘ ప్రముఖమయ్యిందిప్పుడు. మనకి మంచి జాబ్స్ రావాలన్నా, మనం ఆల్రెడీ చేస్తున్న ఉద్యోగ, వ్యాపారాల్లో వృద్ధి సాధించాలన్నా, ఇంగ్లిష్ నేర్చుకోవాల్సిందే.  ప్రస్తుతంఇంగ్లిష్ బాగా తెల్సిన వారికి కార్పోరేట్ కంపనీలలో, ఇంకా అనేక దేశీయ, విదేశీ సంస్థల్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అన్నది నిజం. అలాగే, ప్రభుత్వ ఉద్యోగాలలో, వ్యాపారాలలో చాలావరకు కార్యకలాపాలు ఇప్పుడు ఇంగ్లిష్ లోనే జరుగుతున్నాయి కాబట్టి ఉద్యోగుల, వ్యాపారస్తుల ఇంగ్లిష్ స్కిల్స్ వారి విజయావకాశాల్ని ప్రభావితంచేస్తాయి అన్నది కూడా నిజం.

ఒక్క ముక్కలో చెప్పాలంటే, చారిత్రక, ఆర్ధిక, సామాజిక కారణాలు ఏమైనా కానివ్వండి- సక్సెస్ సాధించడానికి ఇంగ్లిష్ అత్యవసరం అయిపొయిందిప్పుడు. ఏమంటారు?

మీ అభిప్రాయం కూడా ఇదేనా? అయితే, సంతోషం. పదండి.. కలిసి ఇంగ్లిష్ నేర్చుకుందాం. మీరు “ఇంగ్లిష్ బడి” అభిప్రాయంతో ఏకీభవించడం లేదా.. అయినా సంతోషం. కారణం ఏదైనా మీరు ఇంగ్లిష్ నేర్చుకోవాలనుకుంటున్నారన్నది నిజం. కదా? పదండి మనమంతా కలిసి ఇంగ్లిష్ నేర్చుకుందాం. All the best to all of us!